మీ తలకి రెండు వైపులా ఉన్న చిన్న అవయవాలు ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి, శరీరానికి సమతుల్యత మరియు ప్రమాదాల నుండి మిమ్మల్ని ఎలా రక్షించడంలో సహాయపడతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మానవ చెవి కేవలం వినడానికి మాత్రమే కాదు, ఇది అనేక జీవిత-సహాయక పాత్రలను పోషించే సంక్లిష్టమైన అవయవం.
ఈ ఆర్టికల్‌ను ఇంగ్లీష్‌లో చదవండి
చెవికి మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి. బయటి చెవిలో ఆరికల్ (పిన్నా) ఉంటుంది. ఇది ధ్వనిని సేకరించి శ్రవణ కాలువ(Ear Canal) ద్వారా కర్ణభేరి(Ear Drum)కి పంపుతుంది. చెవిలో గులిమి(Earwax) దుమ్ము మరియు సూక్ష్మక్రిముల నుండి శ్రవణ కాలువని రక్షిస్తుంది.
మధ్య చెవి కర్ణభేరి (టిమ్పానిక్ పొర)తో ప్రారంభమవుతుంది. శబ్దం తాకినప్పుడు ఇది కంపిస్తుంది. మల్లియస్, ఇంకస్, స్టేప్స్ అనే మూడు సూక్ష్మ ఎముకలు (Ossicles) ఆ కంపనాలను బలపరిచి లోపలి చెవికి చేరుస్తాయి.
లోపలి చెవిలోని కొక్లియా (Cochlea) ఆ కంపనాలను మెదడు ధ్వనిగా గుర్తించే విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. అవి మనకు శబ్దంగా అనిపిస్తాయి. దీంతోపాటు వెస్టిబ్యులర్ సిస్టమ్ శరీర సమతుల్యతను కాపాడటంలో, కదలికలను గుర్తించటంలో సహాయపడుతుంది.
చెవి పని చేసే విధానం ఇలా ఉంటుంది: శబ్దం బయటి చెవి ద్వారా శ్రవణ కాలువలోకి చేరి, కర్ణభేరిని కంపింపజేస్తుంది. ఆ కంపనాలను చెవిలోని ఎముకలు(Ossicles) బలపరిచి కొక్లియాకు పంపుతాయి. అక్కడి నుంచి మెదడు వాటిని శబ్దంగా అర్థం చేసుకుంటుంది. అదే సమయంలో, వెస్టిబ్యులర్ సిస్టమ్ మన శరీర భంగిమ, కదలికలపై సమాచారం అందించి, మనం నడవడానికి మరియు స్థిరంగా కదలడానికి వీలు కల్పిస్తుంది.
మానవ చెవి 20 Hz నుండి 20,000 Hz వరకు ఉన్న శబ్దాలను గుర్తించగలదని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 5% మంది తీవ్రమైన వినికిడి లోపంతో బాధపడుతున్నారు. చెవిలో ఇన్ఫెక్షన్లు, టిన్నిటస్, గులిమి ఎక్కువగా పేరుకుపోవడం, అధిక శబ్దానికి గురికావడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. పిల్లల్లో మధ్య చెవి ఇన్ఫెక్షన్లు డాక్టర్లను ఎక్కువగా సంప్రదించే కారణాల్లో ఒకటిగా ఉన్నాయి.
చెవి సంరక్షణ కోసం ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు పాటించడం తప్పనిసరి అంటున్నారు. కాటన్ బడ్స్ వంటి పదునైన వస్తువులను చెవిలో పెట్టకండా ఉండడం. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ పెద్ద శబ్దాల నుండి మీ చెవులను రక్షించుకోవడం. ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీ చెవులను పొడిగా ఉంచడం. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులకు క్రమం తప్పకుండా చెవి పరీక్షలు చేయించడం.
చెవి కూడా ముక్కు, కళ్ల మాదిరిగానే మన ఆరోగ్యానికి నిశ్శబ్ద సంరక్షకుడిగా పనిచేస్తుంది. అయినప్పటికీ, చాలా మంది సమస్యలు వచ్చే వరకు దానిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఆరోగ్యకరమైన చెవులు లేకపోతే, ప్రతిరోజు సంభాషణ, సమతుల్యత చాలా కష్టసాధ్యమవుతుంది.
