చివరిగా నవీకరణ: ఆగస్టు 13, 2026
చరిత్రలో ఈరోజు – ఆగస్టు 13 ప్రపంచ చరిత్రలో యుద్ధాలు, రాజకీయ పరిణామాలు, విజ్ఞాన–సాంకేతిక పురోగతి, అంతరిక్ష విజయాలు, క్రీడలు, గణితశాస్త్రం వంటి అనేక రంగాల్లో ప్రాధాన్యం పొందిన రోజు. 1704లో బ్లెన్హైమ్ యుద్ధం నుంచి 1961లో బెర్లిన్ గోడ నిర్మాణానికి దారితీసిన సరిహద్దు మూసివేత, 1969లో అపోలో 11 వ్యోమగాములకు ఘన సత్కారం, 2014లో మరియం మిర్జాఖానీ చరిత్ర సృష్టించడం వరకు ఈ తేదీ అనేక కీలక ఘట్టాలకు సాక్ష్యమైంది.
ఈ ఆర్టికల్‌ను ఇంగ్లీష్‌లో చదవండి
ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకోబోయే అంశాలు:
- ఆగస్టు 13న జరిగిన ముఖ్యమైన చారిత్రక సంఘటనలు
- ఆగస్టు 13న జన్మించిన ప్రముఖుల వివరాలు
- జాతీయ మరియు అంతర్జాతీయ దినోత్సవాల విశేషాలు
- పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ విశేషాలు
Table of Contents
🌟 ఆగస్టు 13 ముఖ్యాంశాలు
- టెనోక్టిట్లాన్ పతనం (1521): స్పానిష్ విజేత హెర్నాన్ కోర్టెజ్ అజ్టెక్ సామ్రాజ్య రాజధాని టెనోక్టిట్లాన్‌ను స్వాధీనం చేసుకోవడంతో మెక్సికోలో స్పానిష్ పాలనకు పునాది పడింది.
- బ్లెన్‌హైమ్ యుద్ధం (1704): స్పాన్సిష్ వారసత్వ యుద్ధంలో బ్రిటన్ మరియు ఆస్ట్రియా కూటమి ఫ్రాన్స్‌పై చారిత్రాత్మక విజయం సాధించింది.
- స్టెయిన్‌లెస్ స్టీల్ ఆవిష్కరణ (1913): హారీ బ్రియర్లీ తుప్పు పట్టని ఉక్కును (Stainless Steel) ఆవిష్కరించి పారిశ్రామిక రంగాన్ని మలుపు తిప్పారు.
- బెర్లిన్ గోడ నిర్మాణం ప్రారంభం (1961): తూర్పు జర్మనీ శరణార్థుల తరలింపును అడ్డుకోవడానికి తూర్పు-పశ్చిమ బెర్లిన్ సరిహద్దులను మూసివేసి గోడ నిర్మాణాన్ని ప్రారంభించింది.
- మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ జననం (1899): ప్రపంచ ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ ఈ రోజునే జన్మించారు.
🗓️ ఆగస్టు 13న జరిగిన ముఖ్య సంఘటనలు
1521 – అజ్టెక్ సామ్రాజ్య పతనం & మెక్సికో స్వాధీనం
హెర్నాన్ కోర్టెస్ నేతృత్వంలోని స్పానిష్ దళాలు మరియు వారి స్థానిక మిత్రబలగాలు దీర్ఘకాల ముట్టడి అనంతరం అజ్టెక్ రాజధాని టెనోక్టిట్లాన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. అజ్టెక్ చక్రవర్తి కౌహ్‌తేమోక్ లొంగిపోవడంతో మెక్సికోలో శతాబ్దాల పాటు సాగిన స్పానిష్ వలస పాలనకు పునాది పడింది. ఈ సంఘటన ఉత్తర అమెరికా చరిత్రను మరియు సంస్కృతిని తీవ్రంగా ప్రభావితం చేసింది.
1889 – కాయిన్ ఆపరేటెడ్ టెలిఫోన్ పేటెంట్
అమెరికాకు చెందిన విలియం గ్రే నాణెం వేసి పనిచేసే మొదటి టెలిఫోన్ (Coin-operated Telephone) విధానానికి పేటెంట్ పొందారు. ఈ సాంకేతికత పబ్లిక్ ఫోన్ బూత్‌ల ఏర్పాటుకు మరియు సామాన్య ప్రజలకు సమాచార వ్యవస్థను చేరువ చేయడానికి దోహదపడింది. గ్లోబల్ టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఇది ఒక విప్లవాత్మక పురోగతి.
1913 – స్టెయిన్‌లెస్ స్టీల్ ఆవిష్కరణ
ఇంగ్లాండ్‌కు చెందిన హారీ బ్రియర్లీ క్రోమియం కాంబినేషన్‌తో తుప్పు పట్టని ఉక్కును (Stainless Steel) తయారు చేశాడు. తుపాకీ పైపుల అరుగుదలను నివారించే ప్రయోగాల్లో అనుకోకుండా జరిగిన ఈ ఆవిష్కరణ ఆధునిక తయారీ రంగాన్ని, గృహోపకరణాలను మరియు శస్త్రచికిత్స పరికరాల తయారీని పూర్తిగా మార్చివేసింది.
1960 – సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ స్వాతంత్ర్యం
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఫ్రాన్స్ వలస పాలన నుండి పూర్తి స్వాతంత్ర్యాన్ని పొందింది. డేవిడ్ డాకో ఆ దేశ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆఫ్రికా ఖండంలో వలస పాలన ముగింపు దిశగా జరిగిన ముఖ్యమైన రాజకీయ పరిణామాల్లో ఇది ఒకటి.
1961 – బెర్లిన్ సరిహద్దుల మూసివేత & బెర్లిన్ గోడ నిర్మాణం
తూర్పు జర్మనీ (GDR) కమ్యూనిస్ట్ ప్రభుత్వం తమ పౌరులు పశ్చిమ బెర్లిన్‌కు వలసపోకుండా నిరోధించడానికి సరిహద్దులను మూసివేసి, బార్బ్‌డ్ వైర్ కంచెలు వేసింది. రెండు రోజుల తర్వాత ఇది ‘బెర్లిన్ గోడ’గా రూపాంతరం చెందింది. ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) నాటి విభజనకు మరియు అణచివేతకు ఈ గోడ ప్రపంచ చిహ్నంగా నిలిచింది.
2004 – ఎథెన్స్ ఒలింపిక్స్ ప్రారంభం
28వ వేసవి ఒలింపిక్ క్రీడలు గ్రీస్ రాజధాని ఎథెన్స్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆధునిక ఒలింపిక్స్ పుట్టిన గ్రీస్ గడ్డపైకి శతాబ్దం తర్వాత క్రీడలు తిరిగి రావడం చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా 201 దేశాల నుండి అథ్లెట్లు పాల్గొన్నారు.
2008 – ఒలింపిక్స్‌లో మైఖేల్ ఫెల్ప్స్ ఆల్-టైమ్ రికార్డు
బీజింగ్ ఒలింపిక్స్ 2008లో అమెరికా ఈతగాడు మైఖేల్ ఫెల్ప్స్ తన 10వ మరియు 11వ కెరీర్ ఒలింపిక్ స్వర్ణ పతకాలను సాధించి, ఒలింపిక్ చరిత్రలోనే అత్యధిక స్వర్ణాలు గెలిచిన అథ్లెట్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
2014 – మరియం మిర్జాఖానీ చరిత్ర
సియోల్‌లో జరిగిన International Congress of Mathematicians ప్రారంభోత్సవంలో మరియం మిర్జాఖానీ ఫీల్డ్స్ మెడల్ అందుకున్నారు. ఫీల్డ్స్ మెడల్ పొందిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు; అదే కార్యక్రమంలో భారతీయ మూలాలున్న గణిత శాస్త్రవేత్త మంజుల్ భార్గవ కూడా ఫీల్డ్స్ మెడల్ అందుకున్నారు.
ఇతర ముఖ్య సంఘటనలు
- 1672: డచ్ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియాన్ హుయ్గెన్స్ అంగారక గ్రహం (Mars) యొక్క దక్షిణ ధ్రువంలోని మంచు శిఖరాన్ని గుర్తించారు.
- 1868: పెరూ మరియు బొలీవియా తీరప్రాంతాల్లో భారీ భూకంపం (Arica Earthquake) మరియు సునామీ సంభవించి 25,000 మందికి పైగా మరణించారు.
- 1942: వాల్ట్ డిస్నీ ప్రసిద్ధ యానిమేషన్ చిత్రం ‘బాంబి’ (Bambi) న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో ప్రదర్శించబడింది.
- 1960: అమెరికా నాసా ప్రయోగించిన ‘ఎకో 1’ పాసివ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా ఉపగ్రహ ఆధారిత ద్విమార్గ టెలిఫోన్ సంభాషణ జరిగింది.
- 2009: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) మహిళా బాక్సింగ్‌ను 2012 లండన్ ఒలింపిక్స్ నుండి అధికారికంగా చేర్చుతున్నట్లు ప్రకటించింది.
🎂 ప్రముఖుల జననాలు
| సంవత్సరం | ప్రముఖులు | ప్రత్యేకత |
| 1888 | జాన్ లాగీ బైర్డ్ | టెలివిజన్ (TV) ఆవిష్కర్త, స్కాటిష్ ఇంజనీర్ |
| 1899 | ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ | హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, “మాస్టర్ ఆఫ్ సస్పెన్స్” |
| 1926 | ఫిడేల్ కాస్ట్రో | క్యూబా విప్లవ నాయకుడు, మాజీ అధ్యక్షుడు |
| 1963 | శ్రీదేవి | భారతీయ చలనచిత్ర తొలి మహిళా సూపర్‌స్టార్, పద్మశ్రీ గ్రహీత |
| 1975 | షోయబ్ అక్తర్ | పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్, “రావల్పిండి ఎక్స్‌ప్రెస్” గా ప్రసిద్ధి. |
📌 ఇతర ప్రముఖుల జననాలు: జర్మన్ సంగీత వాయిద్యాల తయారీదారు, క్లారినెట్ (Clarinet) ఆవిష్కర్త జోహన్ క్రిస్తోఫ్ డెన్నెర్ (1655), అమెరికన్ మహిళా హక్కుల నాయకురాలు, బానిసత్వ వ్యతిరేక పోరాట యోధురాలు లూసీ స్టోన్ (1818), ప్రసిద్ధ అమెరికన్ షార్ప్‌షూటర్ మరియు ప్రదర్శనకారిణి అన్నీ ఓక్లే (1860), ఇంగ్లాండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్-టైమ్ టాప్ స్కోరర్ అలన్ షేరర్ (1970), మరియు తెలుగు చలనచిత్ర దర్శకుడు (‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా దర్శకుడు) అజయ్ భూపతి (1986) ఇదే రోజున జన్మించారు.
🕯️ ప్రముఖుల మరణ వార్షికోత్సవాలు
- 1910 – ఫ్లారెన్స్ నైటింగేల్: ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు మార్గదర్శకురాలు, బ్రిటీష్ సమాజ సేవకురాలు. క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికులకు రాత్రివేళల్లో దివ్యమైన సేవలు అందించి “ది లేడీ విత్ ది ల్యాంప్”గా సుప్రసిద్ధులయ్యారు.
- 1936 – మేడమ్ భికాజీ కామా: భారత స్వాతంత్ర్య సమరయోధురాలు. 1907లో జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్‌లో విదేశీ గడ్డపై మొదటిసారిగా భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన వీరనారి.
- 1988 – పైడిమర్రి వెంకట సుబ్బారావు: తెలుగు రచయిత, బహుభాషావేత్త. మన దేశంలోని పాఠశాలల్లో ప్రతిరోజు చెప్పే జాతీయ ప్రతిజ్ఞ (“భారతదేశం నా మాతృభూమి…”)ని 1962లో విశాఖపట్నంలో తెలుగులో రచించారు.
- 1994 – రావు గోపాలరావు: ప్రసిద్ధ తెలుగు చలనచిత్ర నటుడు, నాటకరంగ ప్రముఖుడు మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు. తన విలక్షణమైన యాస, డైలాగ్ డెలివరీతో తెలుగు చిత్రసీమలో ప్రత్యేక ముద్ర వేశారు.
- 2018 – సోమనాథ్ చటర్జీ: భారత లోక్‌సభ మాజీ సభాపతి (స్పీకర్), సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు మరియు ప్రముఖ న్యాయవాది. 2004 నుండి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా విశిష్ట సేవలందించారు.
📌 ఇతర ప్రముఖుల మరణాలు: ప్రసిద్ధ తెలుగు రచయిత్రి, ‘గృహలక్ష్మి’ పత్రికలో ‘శారద లేఖలు’ ద్వారా స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన సామాజిక వేత్త కనుపర్తి వరలక్ష్మమ్మ (1978), గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ (7 అడుగుల 7.25 అంగుళాలు) శాండీ అల్లెన్ (2008) ఈ రోజున పరమపదించారు.
📢 జాతీయ & అంతర్జాతీయ దినోత్సవాలు
- అంతర్జాతీయ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం (International Lefthanders Day): 1976లో లెఫ్ట్‌హ్యాండర్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డీన్ ఆర్. క్యాంప్‌బెల్ ఈ రోజును ప్రారంభించారు. ప్రపంచ జనాభాలో 10% ఉన్న ఎడమచేతి వాటం కలిగిన ప్రజలు ఎదుర్కొనే సవాళ్లపై అవగాహన పెంచడం దీని ఉద్దేశం.
- ప్రపంచ అవయవ దాన దినోత్సవం (World Organ Donation Day): అవయవ లోపంతో బాధపడుతున్న లక్షలాది మందికి పునర్జన్మ నిచ్చేందుకు ఈ అంతర్జాతీయ ప్రచారం ప్రారంభమైంది. మరణానంతరం అవయవ దానం చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం మరియు అపోహలను తొలగించడం దీని ముఖ్య ఉద్ధేశ్యం. గుండె, మూత్రపిండాలు, కాలేయం, కళ్ళు వంటి అవయవాల దానం ద్వారా విలువైన మానవ ప్రాణాలను కాపాడడం.
- సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ స్వాతంత్ర్య దినోత్సవం: ఆగస్టు 13, 1960న సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఫ్రెంచ్ పాలన నుండి స్వాతంత్ర్యం ప్రకటించబడింది. అందువల్ల ఆగస్టు 13 ఆ దేశానికి జాతీయ ప్రాధాన్యమున్న రోజు.
💡 మీకు తెలుసా?
- అంతరిక్షంలో ఫోన్ సంభాషణ: 1960 ఆగష్టు 13న ప్రయోగించిన ‘ఎకో 1’ శాటిలైట్ సహాయంతో మొదటిసారిగా అంతరిక్షం ద్వారా రెండు ప్రాంతాల మధ్య టెలిఫోన్ సంభాషణ నిర్వహించారు.
- భారతదేశ జాతీయ ప్రతిజ్ఞ రచయిత: లక్షలాది మంది భారతీయ విద్యార్థులు పాఠశాలలో ప్రతిరోజూ పఠించే భారత జాతీయ ప్రతిజ్ఞ (“భారతదేశం నా మాతృభూమి…”) వాస్తవానికి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారిచే తెలుగులో రచించబడింది.
- పెర్సీడ్ ఉల్కాపాతం: ఏడాదిలో అత్యంత ప్రకాశవంతమైన ఉల్కా ప్రదర్శనలలో ఒకటైన పెర్సీడ్ ఉల్కాపాతం (Perseids Meteor Shower), ఉత్తరార్ధగోళంలో ఆగస్టు 12–13 ప్రాంతంలో తన వార్షిక గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్రశ్న 1: భారతదేశ జాతీయ ప్రతిజ్ఞను ఎవరు రచించారు? ఆయన ఏ రోజున కన్నుమూశారు?
జవాబు: జాతీయ ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు 1962లో రచించారు. ఆయన 1988 ఆగష్టు 13న మరణించారు.
ప్రశ్న 2: అంతర్జాతీయ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
జవాబు: ప్రతి సంవత్సరం ఆగష్టు 13వ తేదీన అంతర్జాతీయ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రశ్న 3: స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఎవరు, ఏ సంవత్సరంలో ఆవిష్కరించారు?
జవాబు: స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఇంగ్లాండ్‌కు చెందిన హారీ బ్రియర్లీ 1913 ఆగష్టు 13న ఆవిష్కరించారు.
ప్రశ్న 4: బెర్లిన్ సరిహద్దుల మూసివేత ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు: 1961 ఆగష్టు 13న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ బెర్లిన్ సరిహద్దులను మూసివేసి బెర్లిన్ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ప్రశ్న 5: విదేశీ గడ్డపై భారత జాతీయ జెండాను ఎగురవేసిన తొలి మహిళ ఎవరు?
జవాబు: మేడమ్ భికాజీ కామా. ఆమె 1907లో జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లో జెండాను ఎగురవేశారు. ఆమె మరణదినం ఆగష్టు 13, 1936.
ప్రశ్న 6: టెలివిజన్ (TV) ను కనుగొన్న శాస్త్రవేత్త జన్మదినం ఎప్పుడు?
జవాబు: టెలివిజన్ ఆవిష్కర్త జాన్ లాగీ బైర్డ్ 1888 ఆగష్టు 13న జన్మించారు.
ప్రశ్న 7: ప్రపంచ అవయవ దాన దినోత్సవం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
జవాబు: మరణానంతరం అవయవ దానం చేయడంపై సమాజంలో అవగాహన పెంచి, అవయవ మార్పిడి కోసం వేచి చూస్తున్న బాధితుల ప్రాణాలను కాపాడడం.
ప్రశ్న 8: అజ్టెక్ సామ్రాజ్య రాజధాని టెనోక్టిట్లాన్‌ను స్పెయిన్ ఏ సంవత్సరంలో ఆక్రమించింది?
జవాబు: 1521 ఆగష్టు 13న హెర్నాన్ కోర్టెజ్ నేతృత్వంలో స్పానిష్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ప్రశ్న 9: “ది లేడీ విత్ ది ల్యాంప్” అని ఏ సామాజిక వేత్తను పిలుస్తారు?
జవాబు: ఫ్లారెన్స్ నైటింగేల్. ఆమె 1910 ఆగష్టు 13న మరణించారు.
ప్రశ్న 10: ఫీల్డ్స్ మెడల్ పొందిన తొలి మహిళ ఎవరు?
జవాబు: ఇరానియన్ గణిత శాస్త్రవేత్త మరియం మిర్జాఖానీ; ఆమె 2014 ఆగస్టు 13న ఈ గౌరవం అందుకున్నారు.
ప్రశ్న 11: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది?
జవాబు: 1960 ఆగస్టు 13న.
