మీరు ఎప్పుడైనా ఆలోచించారా – మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా నడుస్తోంది? వస్తువులు ఎలా తయారవుతున్నాయి, అమ్ముడవుతున్నాయి, మనం ఎలా వినియోగిస్తున్నాం అనే ఆలోచనలోకి వెళ్ళితే… అదే ఆర్థిక వ్యవస్థ!
Click here to Read the English version of this article.
సరళంగా చెప్పాలంటే…“వస్తువులు మరియు సేవల ఉత్పత్తిని ఆర్థిక వ్యవస్థ అంటారు”. మీ ప్లేట్‌లో ఉన్న భోజనం నుంచి, మీ ఫోన్‌లో ఉన్న యాప్స్ వరకూ – ఇవన్నీ ఆర్థిక కార్యకలాపాల ఫలితాలే. ప్రజలు, సంస్థలు కలిసి వస్తువులను తయారుచేస్తారు , సేవలు అందిస్తారు , వాటినే మనం వినియోగిస్తాం.
ప్రతి దేశం వస్తువులు, సేవలను ఒకే విధంగా తయారు చేయదు. ఎవరు వాటిని ఉత్పత్తి చేస్తున్నారు అనే ఆధారంగా, మూడు ముఖ్యమైన రకాలుగా ఆర్థిక వ్యవస్థలను విభజించారు. అవి పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ.
పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగం అనగా వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తి చేస్తారు. ఈ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం ఉండదు. వ్యాపారాలు తమ లాభం కోసమే పనిచేస్తాయి. వారు ఏం ఉత్పత్తి చేయాలో, ఎంతకు అమ్మాలో, ఎవరికి అమ్మాలో తామే నిర్ణయిస్తారు. USA, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణలు.
సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం ఉత్పత్తి చేస్తుంది. ఈ విధానంలో ప్రభుత్వమే ఎక్కువ వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహిస్తుంది. లాభం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్య లక్ష్యం. ప్రభుత్వం ఏం తయారుచేయాలో నిర్ణయిస్తుంది మరియు అందరికీ సమానంగా అందేలా చూస్తుంది. ఉదాహరణలు: చైనా, రష్యా, క్యూబా.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలు ఉత్పత్తి చేస్తారు. ఇది లాభం మరియు ప్రజల సంక్షేమం మధ్య ఒక సమతుల్యతతో పని చేస్తాయి. కొన్ని రంగాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయి (ఉదా: రైలు రవాణా, వైద్యం), మరికొన్ని ప్రైవేట్ రంగానికి వదిలేస్తారు (ఉదా: హోటల్స్, మొబైల్ సేవలు). దీని వల్ల అభివృద్ధి మరియు సంక్షేమం రెండూ కొనసాగుతాయి. భారత్, జపాన్, స్పెయిన్, ఫ్రాన్స్, సింగపూర్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పాటిస్తున్నాయి.
మనకు దీని గురించి తెలుసుకోవడం ఎందుకు అవసరం? ఈ ఆర్థిక విధానాలను తెలుసుకోవడం వల్ల మనం వస్తువుల ధరలు ఎందుకు మారుతున్నాయి, ఉద్యోగాలు ఎలా ఏర్పడుతున్నాయి, ప్రభుత్వాలు ఎలా పని చేస్తున్నాయి, మనం, నిపుణుల్లేని పౌరులుగా కూడా, ఆర్థిక వ్యవస్థలో ఎలా భాగం అవుతున్నామో అర్థం చేసుకోవచ్చు.
📢 ఏ ఆర్థిక వ్యవస్థ ఉత్తమంగా పనిచేస్తుందని మీరు భావిస్తారు?
💬 మీ అభిప్రాయాలను కింద కామెంట్‌లో తెలియజేయండి!
