దేశ రక్షణలో స్వావలంబన లక్ష్యంగా, అత్యాధునిక సాంకేతికతలతో భారత సైన్యాన్ని బలోపేతం చేయడంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) కీలకపాత్ర పోషిస్తున్నది.
Click here to Read the English version of this article.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ, మూడు విభాగాల సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఆయుధ వ్యవస్థలు, పరికరాలను అభివృద్ధి చేస్తోంది.
స్వదేశీ పరిశోధన, అభివృద్ధి మరియు ఉత్పత్తి ఆధారంగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అద్భుత విజయాలను సాధించింది. అగ్ని, పృథ్వీ శ్రేణి క్షిపణులు, తేలికపాటి యుద్ధ విమానం తేజస్, మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్ పినాకా, వైమానిక రక్షణ వ్యవస్థ ఆకాష్ – ఇవి DRDO ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన ప్రాజెక్టులు.
ఇవే కాకుండా రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు వంటి వ్యూహాత్మక వేదికల విజయవంతమైన అభివృద్ధి, భారత సైన్యానికి కొత్త శక్తిని అందించాయి. ఈ విజయాలు దేశానికి సమర్థవంతమైన నిరోధక శక్తిని ఇచ్చి, రక్షణ రంగంలో కీలక ఆధిక్యతను కల్పించాయి.
DRDO 1958లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం – DRDO భవన్, న్యూఢిల్లీ. ఆర్మీకి చెందిన టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(TDEs), డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ & ప్రొడక్షన్ (DTDP), డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ (DSO) అనే మూడు సంస్థల కలయిక ద్వారా DRDO ఏర్పడింది. అప్పట్లో ఇది కేవలం 10 సంస్థలు/ప్రయోగశాలలతో పని చేస్తున్న ఒక చిన్న సంస్థగా ఉండేది.
కాలక్రమంగా, DRDO అనేక శాస్త్ర విభాగాలలో విస్తరిస్తూ, పరిశోధనలు, విజయాలు, ప్రతిష్టలతో బహుముఖ అభివృద్ధి సాధించింది. నేడు DRDO దాదాపు 41 ప్రధాన ప్రయోగశాలలు, 5 యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీలతో (DYSLs) విస్తారమైన నెట్‌వర్క్‌గా ఎదిగింది.
ఇవి ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్, యుద్ధ వాహనాలు, ఆయుధాలు, క్షిపణులు, అధునాతన కంప్యూటింగ్, ప్రత్యేక పదార్థాలు, నావల్ సిస్టమ్స్, లైఫ్ సైన్సెస్, శిక్షణ, సమాచార వ్యవస్థలు, వ్యవసాయం మొదలగు వంటి అనేక రంగాల్లో రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై పని చేస్తున్నాయి.
ప్రస్తుతం భారత రక్షణ మంత్రిగా (Minister of Defence) రాజ్‌నాథ్ సింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ సమీర్ V. కామత్, డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ (DDR&D) సెక్రటరీగా, అలాగే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
DRDO యొక్క ట్యాగ్ లైన్/Motto :- “బలస్య మూలం విజ్ఞానం”. ఇది ఒక సంస్కృత పదం. దీనికి అర్ధం “బలానికి మూలం సైన్స్ (source of strength is science)“. చిన్నదిగా మొదలైన DRDO, ఇప్పుడు దేశ భవిష్యత్తును రక్షిస్తున్న మహాసంస్థగా మారింది.
🛡️ భవిష్యత్తులో DRDO ఇంకెన్ని అద్భుత రక్షణ సాంకేతికతలతో మన దేశాన్ని బలోపేతం చేస్తుందో ఊహించారా?
💬 మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో పంచుకోండి…
